Pages

రుగాగమ సంధి - సూత్రము - ఉదాహరణలు

 రుగాగమ సంధి 

ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.

అ) పేదరాలు

ఆ) బీదరాలు

ఇ) బాలింతరాలు

పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం. ఎట్లా మారాయో పరిశీలిద్దాం.

పేద + ఆలు = పేదరాలు

బీద + ఆలు = బీదరాలు

బాలింత + అలు - బాలింతరాలు

పేద + ఆలు -> పేద + ర్ + ఆలు = పేదరాలు

బీద + ఆలు -> బీద + ర్ +  ఆలు = బీదరాలు

బాలింత + అలు -> బాలింత + ర్ + అలు = బాలింతరాలు

పై మూడు సందర్భాలలో పర పదం 'ఆలు'

పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది.

పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను 'పేదాదులు' అంటారు.

పేదాదిపదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.

'ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.(ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే 'ఆగమం'.)


దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు

పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది.

పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం)

ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.

* కర్మధారయమందు పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.

పై పద్ధతి ప్రకారం కింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.

 ముద్దరాలు = ముద్ద + ఆలు 

జవరాలు = జవ + ఆలు 

మనుమరాలు = మనుమ + ఆలు 

కొమరాలు = కొమ + ఆలు 

పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

గుణవంత + ఆలు = గుణవంతురాలు

బుద్దిమంత + ఆలు = బుద్ధిమంతురాలు

శ్రీమంత + ఆలు =  శ్రీమంతురాలు

ఈ సందర్భాలలో కూడా 'ర్' వస్తుంది. కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా? అదేమిటో పరిశీలిద్దాం! 

గుణవంత + ఆలు -> గుణవంత + ఉ+ ఆలు - > గుణవంతు + ఆలు - >గుణవంతు + ర్ + ఆలు - గుణవంతురాలు

శ్రీమంత + ఆలు - శ్రీమంత + ఉ + ఆలు

శ్రీమంత + ఆలు - > శ్రీమంత + ఉ+ ఆలు - > శ్రీమంతు + ఆలు - > శ్రీమంతు + ర్ + ఆలు ->శ్రీమంతురాలు

అలాగే 

బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ+ ఆలు → బుద్ధిమంతు + ఆలు - బుద్ధిమంతు + ర్ + ఆలు - > బుద్ధిమంతురాలు

పై మూడుచోట్ల తత్సమపదాలకు 'ఆలు' కలిస్తే మొదటిపదం చివర ఉన్న అచ్చు 'అ'కారానికి బదులు 'ఉ' కారము వచ్చి తరువాత రుగాగమయింది. దీన్ని ఇట్లా చెప్పవచ్చు.

కర్మధారయమందు తత్సమ శబ్దములకు 'ఆలు' శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివరఉన్న 'అకారానికి' ఉకారము వచ్చి రుగాగమం అయింది.


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు