తెలుగు వ్యాకరణం - సంధులు
ప్రశ్న :- అపదాది స్వర సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము: అందు, అవ - అనునవి తప్ప మిగిలిన ప్రత్యయములు పరమగునపుడు అన్ని అచ్చులకు సంధి నిత్యము. దీనినే ప్రకృతి ప్రత్యయసంధి అనికూడ అందురు.
ఉదా : మూర + ఎడు = మూరెడు
పుట్టి + ఎడు = పుట్టెడు
అందు, అవలకు సంధి వైకల్పికము.
ఉదా : రాములు + అందు - రాములందు, రాములయందు
ఎనిమిది + అవ - ఎనిమిదవ, ఎనిమిదయవ
ప్రశ్న :- ఆమ్రేడిత సంధి గూర్చి వ్రాయుము?
సమాధానము : 1. అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగ నగును.
ఉదా : ఓహో + ఓహో =- ఓహోహో!
ఔర + ఔర = ఔరౌర! |
ఏమి + ఏమి = ఏమేమి!
2. ఆమ్రేడితము పరమైనపుడు క్త్వార్థకమైనను సంధి జరుగును. ఇది కొన్ని రూపములందు మాత్రము జరుగును.
ఉదా : ఇచ్చి + ఇచ్చి = ఇచ్చిచ్చి
అడిగి + అడిగి = అడిగడిగి
ఏగి + ఏగి = ఏగియేగి (ఇచ్చట సంధి లేదు)
ప్రశ్న :- ఆమ్రేడితమనగా నేమి?
సమాధానము : ఆధిక్యము, తొందర మున్నగు వానిని తెలుపుటకై ఒక పదము రెండుసార్లు పలుకబడును (ఉచ్ఛరింపబడును). అట్లు ఉచ్ఛరింపబడిన రెండు పదములలో రెండవది ఆమ్రేడితము.
ఉదా : ఔర + ఔర = ఔరౌర,
ఔహెూ + ఓహో =ఓహోహో
ప్రశ్న :- యడాగమ సంధిని గూర్చి వ్రాయుము?
సమధానము : సంధిలేని చోట స్వరము కంటె పరమైన స్వరమునకు యడాగమము వచ్చును.
యడాగమమనగా 'య్' అను వర్ణము అధికముగా చేరుట. ఇది రెండవ అచ్చు మీద చేరును.
ఉదా : మా + అమ్మ = మా + య్ + అమ్మా = మాయమ్మ
వెల + ఆలు - వెల + య్ + ఆలు - వెలయాలు
ప్రశ్న :- నుగాగమ సంధిని వివరింపుము?
సమాధానము : 1. షష్ఠీ సమాసము నందు 'ఉ'కార - 'ఋ'కారములకు అచ్చు పరమైనపుడు నుగాగమమగును.
నుగాగమమనగా 'న్' అధికముగా చేరుట.
ఉదా: రాజు యొక్క ఆజ్ఞ (షష్టీ సమాసము)
రాజు + న్ + ఆజ్ఞ = రాజునాజ్ఞ
పితృ + ఆనతి - పితృ+న్ + ఆనతి= పితృనానతి
2. ఉదంత తద్ధర్మార్ధక విశేషణములకు అచ్చు పరమగునపుడు నుగాగమమగును.
ఉదా : వచ్చు + అతడు = వచ్చు+న్ + అతడు = వచ్చునతడు.
చూచు + అది = చూచు+న్ + అది =చూచునది
3. ఉదంత స్త్రీ సమములకును, పు, ంపులకును పరుష సరళములు పరమగునపుడు నుగాగము వచ్చును.
ఉదా: బెదురు + చూపులు = బెదురు + న్ + చూపులు (ద్రుత సంధి జరిగి) బెదురుంజూపులు, బెదురుఁజూపులు.
దూరము + చుట్టము = (పుంప్వాదేశ సంధి) = దూర + పు+ చుట్టము;
దూరపు + చుట్టము (నుగాగమ సంధి)
దూరపు + న్ + చుట్టము (ద్రుతసంధి) = దూరపుంజుట్టము, దూరపు ఁజూట్టము.
4. ఉదంత స్త్రీ సమములకును, అదంత గుణవాచకములకును, పుంపులకును 'తనము' పరమగునపుడు నుగాగమగును.
ఉదా : చురుకు + తనము = చురుకు + న్ + తనము - (ద్రుతసంధి) చురుకుందనము, చురుకుఁదనము.
తెల్ల + తనము = తెల్ల + న్ + తనము – (ద్రుతసంది) తెల్లందనము, తెల్లఁదనము.
సరసము + వచనము = (పుంప్వాదేశ సంధి) = సరస + పు+ వచనము = సరసపు + వచనము = సరసపు + న్ +వచనము = (ద్రుత కార్యములు) = సరసంపువచనము
ప్రశ్న : ద్రుత సంధిని (లేక ) సరళాదేశ సంధి గూర్చి వివరింపుము.
సమాధానము : ద్రుత ప్రకృతికములకుగాని, నుగాగమము వచ్చిన చోటు లందుగాని సంధి జరుగునపుడు కలుగు మార్పులను ద్రుతసంధి (లేక ) సరళాదేశ సంధి అని అందురు.
ద్రుత సంధి సూత్రములు :
1. ద్రుత ప్రకృతికము మీది పరుషములు సరళములగును.
ఉదా : పూచెను + కలువలు = పూచె+న్ + గలువలు=పూచెన్ గలువలు
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశేషములు విభాషనగు పక్షంబున స్వత్వంబగు.
1. బిందువనగా నిండుసున్న, అరసున్నలు.
2. సంశ్లేషమనగా మీది హల్లుతో కూడుట
3. స్వత్వమనగా ఉన్నది ఉన్నట్లుగానే ఉండుట.
ఉదా : (1) పూచెంగలువలు, పూచెఁగలువలు (బిందువులు)
(2) పూచెన్గలువలు (సంశ్లేషము)
(3) పూచెను గలువలు (స్వత్వము)
3. ద్రుతమునకు సరళ - స్థిరములు పరమగునపుడు లోప సంశ్లేషములు విభాషనగు పక్షంబున స్వత్వము.
ఉదా : వచ్చెను + గోవులు = వచ్చె + న్ + గోవులు = వచ్చె గోవులు (లోపము), వచ్చె న్గోవులు (సంశ్లేషము) వచ్చెను గోవులు (స్వత్వము)
మెఱసెను + ఖడ్గము – మెఱసె + న్ + ఖడ్గము - మెఱసె ఖడ్గము (లోపము), మెఱసె ఁ ఖడ్గము (సంశ్లేషము) మెఱసెను ఖడ్గము (స్వత్వము)
4. వర్గయుక్కులు గాని, సరళములుగాని పరములగునపుడు ద్రుతమునకు కొన్ని యెడల పూర్ణబిందువు వచ్చును.
ఉదా: - వచ్చెను + ధాత్రీపతి - వచ్చెంధాత్రీపతి
కన్ + దోయి - కందోయి
5. వాక్యావసానమున ద్రుతమునకు గాని, ద్రుత స్వరమునకు గాని లోపము బహుళముగా నగును.
ఉదా: వాఁడు వచ్చెను = వాఁడు వచ్చెన్ వాఁడువాఁడు వచ్చె
6. కొన్ని యెడల ద్రుతము మీద 'న'కారము కూడ వచ్చును.
ఉదా : అదియును + కాక = అదియును + న్ + కాక = అదియునుఁ గాక (సంశ్లేషము) అదియునుంగాక, అదియునుఁగాక (బిందువులు)
7. అఁట, ఇ ఁక, చుఁడు శబ్దములందు తప్ప, నుడి తొలి హ్రస్వము మీది ఖండబిందువును, ద్రుతమునకు లోపమును లేదు.
ఉదా : ముంగొంగు = ముందు + కొంగు
క్రొంబసిడి = క్రొత్త + పసిడి
కందోయి = కను + దోయి
8. తాను, నేను పదముల ద్రుతమునకు సంశ్లేషము లేదు. దీర్ఘముమీదిది గాన దీనికి నిండు సున్నయు లేదు.
ఉదా : తాను + చదివె = తాంజదివె, తానుజదివె
తాను + వినె = తావినె, తాను వినె
9. సమాసమునందు ద్రుతమునకు లోపమగును.
ఉదా : ఎల్లన్ + అర్ధములు = ఎల్లయర్ధములు
ఎల్లన్ + కలుషములు = ఎల్ల కలుషములు
ప్రశ్న :- టుగాగమ సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : 'ట్' ఆగమముగా చేరు సంధిని టుగాగమ సంధి అందురు.
టుగాగమ సంధి సూత్రములు :
1. కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునపుడు టుగాగమ మగును.
ఉదా : కఱకు + అమ్ము = కఱకు + ట్+అమ్ము = కఱకుటమ్ము
నిగ్గు + అద్దము = నిగ్గు + ట్ + అద్దము = నిగ్గుటద్దము
2. కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు 'ఆలు' శబ్దము పరమగునపుడు టుగాగమము విభాషనగు.
ఉదా : పేరు + ఉరము = పేరుటురము, పేరురము
చిగురు + ఆకు = చిగురుటాకు, చిగురాకు
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు, పొదరిల్లు
ప్రశ్న :- రుగాగమ సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : 'ర్' ఆగమముగా చేరు సంధిని రుగాగమ సంధి అందురు.
రుగాగమసంధి సూత్రములు :
(1)కర్మ ధారయమునందు పేదాది శబ్దములకు 'ఆలు' శబ్దము పరమగునపుడు రుగాగమమగును.
ఉదా : పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు
బీద + ఆలు - బీద + ర్ + ఆలు = బీదరాలు
పేద, బీద, ముద్ద, బాలింత, కొమ, జవ, అయిదువ, మనుమ, గొడ్డు, ఇట్టివి పేదాదులు.
(2)కర్మధారయము నందు తత్సమములకు 'ఆలు' శబ్దము పరమగునపుడు అత్వమునకు ఉత్వము రుగాగమము వచ్చును.
ఉదా : ధీర + ఆలు = ధీరు + ఆలు (అత్వమునకు ఉత్వము)
ధీరు + ర్ + ఆలు = ధీరురాలు (రుగాగమము)
గుణవంత + ఆలు = గుణవంతురాలు
ప్రశ్న :-పుంప్వాదేశ సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : పుంపులు ఆదేశముగా వచ్చు సంధిని పుంప్వాదేశ సంధి అందురు.
పుంప్వాదేశ సంధి సూత్రములు :
కర్మధారయములందు ము వర్ణమునకు పుంపులగును.
ఉదా : సరసము + మాట = సరసపు మాట, సరసంపుమాట
విరసము + వచనము - విరసపువచనము, విరసంపువచనము
ప్రశ్న :- ద్విరుక్త టకారాదేశ సంధిని వివరింపుము?
సమాధానము : ద్విరుక్తమైన టకారము (ట్ట్) ఆదేశముగా వచ్చు సంధిని ద్విరుక్త టకారాదేశ సంధి అందురు.
ద్విరుక్త టకారాదేశ సంధి సూత్రములు :--
1) కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డ-లకు అచ్చు పరమగు నపుడు ద్విరుక్తటకారమాదేశ మగును.
ఉదా : కుఱు + ఉసురు = కు + ట్ట్ + ఉసురు = కుట్టుసురు
నడు + ఇల్లు - న + ట్ట్ + ఇల్లు - నట్టిల్లు
(2) ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలి యచ్చుమీది వర్ణములకెల్ల నదంతమగు ద్విరుక్త టకారమగును.
ఉదా : కడ + కడ - కట్టకడ
మొదట + మొదట - మొట్టమొదట
కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు, మొదలు- మున్నగునవి కడాదులు.
ప్రశ్న :- గసడదవాదేశ సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : గ, స, డ, ద, వ -లు ఆదేశముగా వచ్చు సంధిని గసడదవాదేశ సంధి అందురు.
గసడదవాదేశ సంధి సూత్రములు :
(1)ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగును
ఉదా : వాఁడు + కొట్టె = వాఁడు గొట్టె, వాఁడుకొట్టె
అపుడు + చనియె = అపుడు సనియె, అపుడు చనియె
(2)కళలగు క్రియా పదములమీది పరుషములు సరళములగును.
ఉదా : రారు + కదా = రారుగదా, రారుకదా
వత్తురు + పోదురు - వత్తురు వోదురు, వత్తురు పోదురు
(3) తెలుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు
ఉదా : వాఁడు + కంసారి - వాఁడు కంసారి
వీఁడు + చక్రపాణి - వీఁడు చక్రపాణి
(4)ద్వంద్వము నందు పదముపై పరుషములకు గసడదవలగు.
ఉదా : కూర + కాయ = కూరగాయలు
కాలు + చేయి = కాలు సేతులు
తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
(5) అపార్ధము తోచునప్పుడును, వినుటకు సొంపుగా లేనప్పుడును గసడదవా దేశ సంధి చేయకూడదు.
ఉదా : ఆ పిల్ల గోడలు = ఆ పిల్లకోడలు
ఆమె సీరగట్టినది = ఆమె చీర కట్టినది
అది డేకు చెట్టు = అది టేకు చెట్టు
రెండు వాటలు = రెండు పాటలు
ప్రశ్న :- ప్రాతాది సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : ప్రాతాదులకు జరుగు సంధిని ప్రాతాది సంధి అందురు.
ప్రాతాది సంధి సూత్రములు :
(1) సమాసము నందు ప్రాతాదుల తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల లోపము బహుళముగా నగును.
ఉదా: ప్రాంత + ఇల్లు = ప్రాయిల్లు, ప్రాంతయిల్లు
లేత + దూడ = లేదూడ, లేఁతదూడ
పూవు + రెమ్మ = పూరెమ్మ, పూవు రెమ్మ
(2) లుప్త శేషము నకు పరుషములు పరమగునపుడు నుగాగమము వచ్చును. లుప్త శేషమనగా లోపించగా మిగిలినది.
ఉదా : పూవు + తోట = పూ + తోట (నుగాగమము)
పూ+న్ + తోట - (ద్రుతసంధి) పూఁదోఁట
కెంపు తామర = కె + తామర = కె +న్ + తామర = కెందామర
(3) కొత్త - శబ్దమునకు ఆద్యక్షర శేషమున కొన్ని యెడల నుగాగమమును, కొన్ని యెడల మీది హల్లునకు ద్విత్వమును వచ్చును.
ఉదా : క్రొత్త + చాయ = క్రొ + న్ + చాయ = క్రొంజాయ (నుగాగమము)
క్రొత్త + తావి - క్రొత్తావి (ద్విత్వము)
ప్రశ్న :- త్రికసంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : ఆ,ఈ,ఏ- లను సర్వనామములు త్రికములనఁబడును.
త్రికసంధి సూత్రములు :
(1) తికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగానగు.
ఉదా : ఆ + కన్య - ఆ + క్కన్య
ఈ + కాలము - ఈ + క్కాలము
(2) ద్విరుక్తమగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వము వచ్చును.
ఉదా : ఆ + కన్య = అక్కన్య
ఈ +క్కాలము = ఇక్కాలము
ప్రశ్న :- అనుకరణ సంధిని గూర్చి వ్రాయుము?
సమాధానము : 'అను' అనునది పరమగునపుడు జరుగు మార్పులను గురించి చెప్పు సంధిని అనుకరణ సంధి అందురు.
అనుకరణ సంధి సూత్రములు :
(1) అనుకరణము పరమగునపుడు విసర్గము లోపించును
ఉదా : వర్ధతాం శ్రీః + అనియె = వర్ధతాంశ్రీ యనియె
(2) అనుకరణమునందు 'నమః' శబ్దము చివరి ఆకారమునకు ఓత్వం విభాషనగు.
ఉదా : తుభ్యం నమః + అనె = తుభ్యంనమోయనె, తుభ్యంనమయనె
(3) అనుకరణమునందు తుది హల్లునకు ద్విత్వము వచ్చును.
ఉదా : క్వింతత్ + అనియె - క్వింతత్తనియె
కస్త్వమ్ + అనియె - కస్త్వమ్మనియె
(4) అనుకరణమునందు 'అహమ్' మున్నగు శబ్దముల మకారమునకు ద్విత్వము వికల్పముగా వచ్చును.
ఉదా : దాసోహమ్ + అనె -= దాసోహమ్మనె, దాసోహమనె
తత్కర్తవ్యమ్ + అనె నె తత్కర్తవ్యమ్మనె, తత్కర్తవ్యమనె
(5) అనుకరణము నందు ఉదంత నామములకు వుగాగమము వచ్చును.
ఉదా : ఇయం ధేనుః + అనె ఇయంధేను వనె.
0 comments:
Post a Comment