శ్రీ వేమన పద్య సారామృతము - ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు
పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ !
అర్థం: మూఢుడు మూఢునే మెచ్చుకుంటాడు. అజ్ఞానిని పరమ లుబ్ధుడు కొనియాడుతాడు. పంది బురదని యిష్టపడుతుంది. కానీ, పన్నీటిని మెచ్చునా? అని భావం.
శ్రీ వేమన పద్య సారామృతము - గంగ పారుచుండు కదలని గతితోడ
గంగ పారుచుండు కదలని గతితోడ
మురికికాల్వ పారు మ్రోత తోడ
దాత యోర్చిన ట్లధము డోర్వగ లేడు
విశ్వదాభిరామ వినుర వేమ!
అర్థం: గంగ ప్రశాంతంగా ప్రవహించుతుంది. కుళ్ళు కాలువ గోల గోల చేస్తూ పరుగెడుతుంది. దాతకు గల ఓరిమి గుణం అధముడికి యెలా ఉంటుంది? అధముడు అధముడే, దాత దాతే.
శ్రీ వేమన పద్య సారామృతము - కానివాని చేత కాసు వీనము లిచ్చి
కానివాని చేత కాసు వీనము లిచ్చి
వెంట దిరుగుటెల్ల వెర్రితనము
పిల్లిబట్టకోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినుర వేమ !
అర్థం: దరిద్రుడికి ఉన్న కాస్తా అప్పుయిచ్చి దాన్ని రాబట్టుకోవడానికి వాణ్ణి వెంబడించడం వెర్రితనం కాదా? పిల్లిని పట్టుకోవడానికి “బోబో” అని, కోడిని పిలిస్తే ఎలా ఉంటుంది? వ్యర్ధ ప్రయాస.
శ్రీ వేమన పద్య సారామృతము - పిసినివాని యింట పీనుగు వెడలిన
పిసినివాని యింట పీనుగు వెడలిన
కట్ట కోలలకును కాసులిచ్చి
వెచ్చమాయ నటంచు వెక్కి వెక్కేడ్చురా
విశ్వదాభిరామ వినుర వేమ!
అర్థం: లోభి యింటి వారు చనిపోతే దహన సంస్కారానికి కాసులిచ్చి ఖర్చయినందుకు వలవలా యేడుస్తాడు.
శ్రీ వేమన పద్య సారామృతము - కష్టలోభివాని కలిమికి నాశించి
కష్టలోభివాని కలిమికి నాశించి
బడుగువాడు దిరిగి పరిణమించు
తగరువెంట నక్క తగిలిన చందంబు
విశ్వదాభిరామ వినుర వేమ!
అర్థం: లోభివాడని తెలియక పేదవాడాతని వెంట తిరుగును. కానీ లాభం లేదు. గొర్రిని వెంబడించిన నక్క గతి యెట్లుండునో బడుగువాని పని కూడా అంతే!!
0 comments:
Post a Comment