Pages

Showing posts with label Potana Bhagavatam. Show all posts
Showing posts with label Potana Bhagavatam. Show all posts

భాగవతం - ప్రథమ స్కంధము - శారదనీరదేందు

                                  భాగవతం - ప్రథమ స్కంధము - శారదనీరదేందు  
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం 
దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా 
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!


తాత్పర్యం : తల్లీ! భారతీ! తెల్లవి కాంతులు వెల్లివిరిసే శరన్మేఘకదంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చకర్పూరమూ, పటీరమూ, రాజహంసలూ, జాజిచెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా, రెల్లుపూలూ, ఆదిశేషుడూ, మల్లెలూ, మందారాలూ, పాలసముద్రమూ, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా - ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్జ్వలమైన ఉపమానాలు, అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడు దర్శింపగలుగుతానో గదా! 

Potana Bhagawatam - Aatata Seva

పోతన భాగవతం - మొదటి స్కంధము - ఆతత సేవఁ  
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయసౌఖ్య విధాతకు వేద రాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకు గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్

తాత్పర్యం: చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చినవాడూ, సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడూ, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడూ, నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడూ, భక్తుల పాపాలను పోకార్చిన వాడూ, దీన జనులను  ఓదార్చినవాడూ,  తపోధను లందరికీ శుభాలు ఒనగూర్చినవాడూ ఐన మహానుభావుణ్ణి బ్రహ్మ దేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను. 

Potana Bhagawatam - Vaalina Bhakti Padyam

పోతన భాగవతం - మొదటి స్కంధము - వాలిన భక్తి మ్రొక్కెద 
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా 
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ 
బాల శశాంక మౌళికి(  గపాలికి మన్మథ గర్వ పర్వతో 
న్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ 

తాత్పర్యం: కరాన ముమ్మొనవాలూ, ఉరాన పునుకల పేరూ, శిరాన నెలవంకా ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్ప దర్పహరుడు. పర్వత రాజపుత్రి ముఖపద్మాన్ని ప్రఫుల్లం కావించే ప్రభాకరుడు. నారదుడు మొదలైన మౌనిసత్తముల చిత్తములనే నెత్తిమ్మి విరులలో విహరించే మత్తమధుకరుడు. 

భాగవతం - ప్రథమ స్కంధము - శ్రీకైవల్య పదంబుఁ

భాగవతం - ప్రథమ స్కంధము - శ్రీకైవల్య పదంబుఁ 
శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర 
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో 
ద్రేక స్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా 
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్. 

తాత్పర్యము: అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనందగోవుని ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోదా కిశోరుడు సామాన్యుడు కాడు; ఏ మాత్రం ఏమరు పాటు లేకుండా ఎల్లలోకాలనూ చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్వాన్ని నిర్ములిస్తూ ఉంటాడు. అంతే కాదు. కన్నతల్లి ఒడిలో ఒయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్కమాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు, ఎన్నెన్నో బ్రహ్మాండభాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు