Pages

Showing posts with label Bhaskara poems. Show all posts
Showing posts with label Bhaskara poems. Show all posts

భాస్కర శతకము పద్యాలు - ఘను డొకవేళఁ గీడ్పడినఁ

 భాస్కర శతకము పద్యాలు - ఘను డొకవేళఁ గీడ్పడినఁ 

ఘను డొకవేళఁ గీడ్పడినఁ గ్రమ్మఱ నాతని లేమి నాపగాఁ 
గనుఁగొన నొక్కసత్ప్రభువుగాక నరాధము లోప రెందరున్ 
బెనుచెఱు వెండినట్టితరి  బెల్లున మేఘుఁడు గాక నీటితో
దనుపఁ దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!

 తాత్పర్యం: చెఱువు ఎండిపోయినచో దానిని నీటితో నిండించుటకు మేఘుడే సమర్థుడుకాని, మంచుతుంపర లెన్నయిననూ ఆ చెరువును నిండింపలేవు. అట్లే గొప్పవాడు హీనస్థితిలో నుండినచో సామాన్యు లెవరును వాని నుద్దరింపలేరు. అతని నుద్దరింప రాజే సమర్థుడు.

భాస్కర శతకము పద్యాలు - ఘనుఁ డగునట్టివాఁడు

 భాస్కర శతకము పద్యాలు - ఘనుఁ డగునట్టివాఁడు

ఘనుఁ డగునట్టివాఁడు నిజకార్యసముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్థనచేయుట తప్పుగాదుగా 
యనఘతఁ గృష్ణజన్మమున నావసుదేవుడు మీఁదుటెత్తుగాఁ 
గనుఁగొని గాలిగానికడ కాళ్లకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా.

తాత్పర్యం: వసుదేవుఁడు - ఒకానొక చంద్రవంశపురాజు. బలరామకృష్ణుల తండ్రి. కంసుని బావమరది. ఈయన భార్యయగు దేవకీదేవితోఁ గూడ కంసుని చెఱలో నుండఁ గా నీతనికి శ్రీకృష్ణుడు జన్మించెను. అప్పటికే దేవకికి పుట్టిన ఏడుగుర్ని చంపేశాడు. 
కంసుడు. కృష్ణునైనను వారు దక్కించుకొనదలచి, వసుదేవుడర్థరాత్రమున ఖైదు వెడలి శ్రీకృష్ణుని తీసికొని పోవుచుండగా నొక గాడిద వానిని చూసి ఓండ్ర పెట్టసాగెను. అందుచే తన రహస్యము బట్టబయలగునేమోనని వసుదేవుడు గాడిదను ప్రార్థించి, తన పనిని నెరవేర్చుకొనెను. కావున, ఎంత గొప్పవాడైనను తన కార్యము నిర్వహించుకొనుటకు నీచుని ప్రార్థించిననూ తప్పులేదు. 

భాస్కర శతకము పద్యాలు - ఘనబలసత్వ మచ్చుపడఁ గల్గినవానికి

 భాస్కర శతకము పద్యాలు - ఘనబలసత్వ మచ్చుపడఁ గల్గినవానికి

ఘనబలసత్వ మచ్చుపడఁ గల్గినవానికి హాని లేనిచోఁ
దనదగు సత్త్వమే చెఱుచుఁ దన్ను నదెట్లన నీరు లావుగా
గను వసియించినన్ జెరువుగట్టకు సత్త్వము చాలకున్నఁచో
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడ కున్నె భాస్కరా ! . 

 తాత్పర్యం: మిగుల బలము గలవానికి నితరులవల్ల బాధ లేకపోయినను తన బలమే తనను పాడుచేయుటకుఁజాలును. చెఱు వెంతనిండియున్నను కట్ట గట్టిగా లేని యెడల కన్నములు పెట్టి గండిపడి తెగిపోవుటకు తన నీరే కారణము గదా!

భాస్కర శతకము పద్యాలు - గిట్టుట కేడఁ గట్టడ లిఖించును

 భాస్కర శతకము పద్యాలు - గిట్టుట కేడఁ గట్టడ లిఖించును

గిట్టుట కేడఁ గట్టడ లిఖించును నచ్చటఁగాని యొండుచోఁ
బుట్టదు చావు జానువులపున్కల నూడిచి కాశిఁ జావఁ గా 
లట్టిన శూద్రకున్ భ్రమల గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మర్రికడఁ బ్రాణము తీసెందగయ్య భాస్కరా

 తాత్పర్యం:  శూద్రక మహారాజు తానెక్కడకునూ పోకుండ కాశిపురమందే మృతినొందదలచి, తన మోకాటి చిప్పల నూడదీయిచుకొని, నచ్చటనే యుండవలెనని నిశ్చయము చేసికొనగా, నా రాజునకు దైవమొక గుఱ్ఱమై వచ్చి ఆ సమయమున నాతనినొక మర్రిచెట్టు కడకు గొనిపోయి అచట వాని ప్రాణమును పోగొట్టెను. కావున, దైవ విధానమునకు భ్రమసేయుట కెంత యత్నించినను సఫలముకాదని యెఱుంగవలెను. తనకు చావు ఒక దగ్గఱ  లిఖింపబడి యుండగా వేరొకచోట నెవ్వడును చావడు.

భాస్కర శతకము పద్యాలు - క్రూరమనస్కులౌ పతులం

 భాస్కర శతకము పద్యాలు - క్రూరమనస్కులౌ  పతులం

క్రూరమనస్కులౌ  పతులం  గొల్పి వసించిన మంచివారికిన్
వారిగుణంబె పట్టి చెడువర్తన వాటిలు మాధురీజలో 
దారలు గౌతమీముఖమహానదులంబుధిఁ గూడినంతనే
క్షారముఁజెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా 

తాత్పర్యం: తియ్యని నీరు గలిగిన గోదావరి గంగ మొదలగు ప్రవాహములన్నియు సముద్రమునంబడి యుప్పఁబడి చెడినట్లు దుర్గుణుఁడగు ప్రభువు యొక్క సాంగత్యమువల్ల యోగ్యులును చెడిపోయి క్రూరులగుదురు. 

భాస్కర శతకము పద్యాలు - కులమున నక్కడక్కడ నకుంఠితధార్మికుఁ డొక్కఁ డొక్కడే

 భాస్కర శతకము పద్యాలు - కులమున నక్కడక్కడ నకుంఠితధార్మికుఁ డొక్కఁ డొక్కడే

కులమున నక్కడక్కడ నకుంఠితధార్మికుఁ డొక్కఁ డొక్కడే
కలిగెడుఁ గాక పెందఱుచు గల్గఁగ నేరరు చెట్టుచెట్టునన్
గలుగఁగ నేర్చునే గొడుగుకామలు చూడఁగ నాడ నాడ నిం
పలరంఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకుఱుఁగాక భాస్కరా ! 

తాత్పర్యము: ఏ కులముననైనను ధర్మశీలురగు పురుషు లెక్కడనో నూటికి గోటికి నందురుకాని యంతటను గలుగరు. ఎక్కడైనను చెట్టునకు ఒకటి అఱ దొరకునుగాని ప్రతి చెట్టునను పుట్టిన కొమ్ములన్నియు గొడుగు కర్రలు కావుగదా? 

భాస్కర శతకము పద్యాలు - కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం

 భాస్కర శతకము పద్యాలు - కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం

కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం
దూరిన నెంతవారలకుఁ దొల్లి పరీక్షితు శాపభీతుఁడై
వారధి నొప్పునుప్పరిగపై బదిలంబుగ దాఁగి యుండినం
గ్రూర భుజంగదంతహతిఁ గూలఁడె లోకులెఱుంగ భాస్కరా ! 

తాత్పర్యం: పూర్వము పరీక్షిత్తు అనే మహారాజు వేటకు వెళ్లి, ఆ అడవిలో వేటాడి అలసిపోయి, దప్పికగొని ఒక మునిని దాహానికి నీళ్లు ఇమ్మని అడిగెను. తపస్సున నేకాగ్రుఁ డైన యా మునియు నీతని విచారింపఁడయ్యెను. అందులకుఁగోపించి 
యారాజాముని మెడలో నొక చచ్చిన పామును వైచెను. అది చూచి మునిపుత్రుఁ డు మా తండ్రి మెడలో పామును వైచినవాఁడేడు రోజులలో పాము గఱచి చచ్చుగాకని తిట్టెను. పరీక్షిన్మహారాజు మునిశాపముచే తనకు కీడుకల్గునని తలంచి సముద్రమందు మేడను నిర్మంపజేసి అందు దాగియుండినను, విధి విధానము యెవ్వరికిని నతిక్రమింప వీలుకాని దగుటచే నతడు తుదకు పాముకాటుచే మరణించెను. ఎంత గొప్ప వాడైనను దైవ విధానమునకు ప్రతి విధానముచేసి ఆ యాపదలను తొలగించుకొందమన్నను, నవి యసాధ్యములుగాక, సాధ్యములగునా ? 

భాస్కర శతకము పద్యాలు - కామితవస్తుసంపదలు గల్గుఫలం బొరు లాసపడ్డచో

 భాస్కర శతకము పద్యాలు - కామితవస్తుసంపదలు గల్గుఫలం బొరు లాసపడ్డచో

కామితవస్తుసంపదలు గల్గుఫలం బొరు లాసపడ్డచో
నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫల మున్నఁబోయినన్ 
బ్రామికపడ్డలోకులకుఁ  బండఁగ నే మది యెండిపోవఁగా
నేటిఫలంబు చేఁదు విడ దెన్నఁటికైన ముసిండి భాస్కరా! 

తాత్పర్యం: ఎప్పుడును చేదు వదలని ముసిండి చెట్టు, పండిననూ ఎండిననూ ఒకటే ! (అనగా భక్ష్యయోగ్యముగాదని భావము) అట్లే మనుజుఁడు తన్నాశ్రయించి కోరుచున్న మానవులకు ఎంతమాత్రము ఫలమీయనిచో వానికి సంపద కలిగిననూ లేకుండిననూ ఒకటే.

భాస్కర శతకము పద్యాలు - కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంతవిద్యవాఁ

 భాస్కర శతకము పద్యాలు - కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంతవిద్యవాఁ

కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంతవిద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు మహేశుపట్టి వి 
ద్యానిధి సర్వవిద్యలకుఁ దానె గురుండు వినాయకుండు దా 
నేనుఁగురీతి నుండియు నదేమిటి కాదండ్రు పెండ్లి భాస్కరా.

తాత్పర్యం:  జనుఁడు తానెంత చదువరియైనను, దొడ్డరాజుబిడ్డఁడైనను కాని పని కానేకాదు.మహేశ్వరునంతవానికిఁ గొడుకై ఎల్లవిద్యలకుఁ దావలమై విద్యలకన్నింటికిఁ దాన గురువగు విఘ్నేశ్వరుఁడు తాఁ బెండ్లి చేసికొనఁగలిగెనా ? లేదు

Bhaskara Satakam Padyalu - Kattada leni

 భాస్కర శతక పద్యం - తాత్పర్యము - కట్టడ లేని 

కట్టడ లేనికాలములఁ గాదు శుభం బొరులెంతవారు చే 
పట్టిన నైన మర్త్యునకు భాగ్యము రాదను టెల్లఁ గల్ల కా 
దెట్టని పల్కినన్ దశరథేశ వశిష్ఠులు రామమూర్తికిన్ 
బట్టము కట్టఁ గోరి రది పాయక చేకురే నోటు భాస్కరా!

తాత్పర్యము: మనుజునకు దైవానుగ్రహము లేనితఱి నెంతవారు సహాయపడినను ఏ శుభమును కలిసిరాదు. ఏ భాగ్యమును అబ్బదు. అతిసమర్థుడగు దశరథ మహారాజును, మహామునియగు వశిష్టుడును పూనుకొనినను రఘురాముని పట్టాభిషేకము దైవగతి లేనిదే కాఁగలిగెనా?


Bhaskara Satakam Padyalu - Uraka sajjanum

భాస్కర శతక పద్యం - ఊరక సజ్జనుం 
ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని 
ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా 
చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా 
జేరి చినింగిపోఁ  గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!

తాత్పర్యము : సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును?

భాస్కర శతక పద్యాలు - ఊరక వచ్చు

భాస్కర శతక పద్యాలు - ఊరక వచ్చు 
ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే 
పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ 
వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం 
గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా 

తాత్పర్యము: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును. 

భాస్కర శతక పద్యాలు - ఉరుగుణవంతు

భాస్కర శతక పద్యాలు - ఉరుగుణవంతు 

ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం 
బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా 
నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ 
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!

తాత్పర్యము: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా?

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు